కన్నబిడ్డలను చంపిన తండ్రి.. మృతదేహాలను దుప్పట్లో మూట కట్టి..

ఖమ్మం జిల్లా రాయపట్నంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో శివరాం గోపాల్ అనే వ్యక్తి తన కన్నబిడ్డలను గొంతు నులిమి చంపాడు.

By అంజి
Published on : 11 July 2023 8:07 AM IST

father strangled children, Madhira, Khammam district, Crime news

కన్నబిడ్డలను చంపిన తండ్రి.. మృతదేహాలను దుప్పట్లో మూట కట్టి..

ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో శివరాం గోపాల్ అనే వ్యక్తి తన కన్నబిడ్డలను గొంతు నులిమి చంపాడు. అనంతరం మృత దేహాలను దుప్పట్లో మూటకట్టి పెట్టాడు. చిన్నారులు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా కూడా పిల్లల జాడ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో వెతకగా మూటకట్టిన దుప్పట్లో మృతదేహలు కనిపించాయి. అయితే పిల్లలను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా పిల్లలు అప్పటికే మృతిచెందారని వైద్యులు నిర్థారించారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొద్దికాలంగా కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు పడుతున్న శివరాం గోపాల్ సాయంత్రం పాఠశాల నుంచి ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకు వచ్చి చితకబాదాడు. అనంతరం మద్యం మత్తులో ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపేశాడు. చిన్నారులు పార్షపు రామకృష్ణ( 7), ఆరాధ్య (6)ఊపిరాడక కన్నుమూశారు. పిల్లలు మరణించడంతో కన్నతల్లి ఏసుమణి, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి శివరాం గోపాల్ పరారీలో ఉన్నాడు.

ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు.విషయం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఎస్‌హెచ్‌వో అవినాష్‌ కుమార్‌, సీఐ వసంత్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివరాం గోపాల్ పై గతంలో పలు నేరపూరిత కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల జైలు శిక్ష అనుభవించి శివరాం బయటికి వచ్చాడు. ఆసుపత్రి ఆవరణలో మృతిచెందిన కుమార్తెను భుజంపై వేసుకుని తల్లి ఏసుమణి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టిస్తున్నారు.

Next Story