దారుణం.. మ‌ద్యం మ‌త్తులో కొడుకును చంపిన తండ్రి

A father who killed his son under the influence of alcohol.మ‌ద్యం మ‌త్తులో ఓ వ్య‌క్తి దారుణానికి ఒడిగ‌ట్టాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Nov 2022 10:20 AM IST
దారుణం.. మ‌ద్యం మ‌త్తులో కొడుకును చంపిన తండ్రి

బిడ్డ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాడు క‌న్న తండ్రి. చిన్నారుల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా త‌ను త‌ల్ల‌డిల్లిపోతుంటాడు. అయితే.. మ‌ద్యం మ‌త్తులో ఓ వ్య‌క్తి దారుణానికి ఒడిగ‌ట్టాడు. చిన్నారి ఏడుస్తున్నాడ‌ని కోపంతో అత‌డిని హ‌త‌మార్చాడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. దివ్య‌, సుధాక‌ర్ లు 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నేరేడ్మెట్ జేజే నగర్ లోని ఎస్.ఎస్.బి క్లాసిస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్లుగా ప‌నిచేస్తూ అక్క‌డే ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు సంతానం. మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న సుధాక‌ర్ సోమ‌వారం రాత్రి కూడా పుల్లుగా తాగి ఇంటికి వ‌చ్చాడు.

అదే స‌మ‌యంలో వారి రెండేళ్ల కుమారుడు ఏడుస్తూ క‌నిపించాడు. త‌న కుమారుడిని స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. ఆ చిన్నారికి ఏం క‌ష్టం వ‌చ్చిందో తెలీదు గానీ ఏడుపు ఆప‌లేదు. అయితే.. ఆగ్ర‌హంతో ఊగిపోయిన సుధాక‌ర్‌.. కొడుకును దారుణంగా కొట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మృత‌దేహాన్ని చూసి దివ్య గుండెలు అవిసేలా రోదించింది. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సుధాక‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story