కూతురు మీద ప్రేమతో హంతకుడిగా మారిన తండ్రి

కుమార్తె మీద మితిమీరిన ప్రేమ ఓ తండ్రిని హంతకుడిగా మార్చింది. గుంటూరు జిల్లాలో వైద్యుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  3 Nov 2023 3:14 AM GMT
Crime AP, APnews,  Guntur district, love

కూతురు మీద ప్రేమతో హంతకుడిగా మారిన తండ్రి

కుమార్తె మీద మితిమీరిన ప్రేమ ఓ తండ్రిని హంతకుడిగా మార్చింది. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన వైద్యుడి హత్య కేసులో నిందితుడిని కొత్తపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కూతురితో వైద్యుడి ప్రేమ వ్యవహారం నచ్చకనే నిందితుడైన తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు తెలిపారు. ఫిరంగిపురం మండలం తాళ్లూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి తన కూతురిను ఫార్మా డి చదివించాడు. ఆమె గుంటూరువారితోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తోంది. అక్కడే ఫిజియోథెరఫీ డాక్టర్‌గా పనిచేస్తున్న పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులు ఆమెకు పరిచయమయ్యాడు.

వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే సీతారామాంజనేయులుకు తన బంధువుల అమ్మాయితో పెళ్లి అయ్యింది. భార్యతో విబేధాలు రావడంతో విడిగా ఉంటున్నారు. లవ్‌ విషయం నచ్చని యువతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఆమెను హయ్యర్‌ స్టడీస్‌ కోసం ఏడాది క్రితం అమెరికాకు పంపించాడు. రెండేళ్ల కోర్సు చదవాల్సి ఉండగా, పూర్తి కాకుండానే ఆమె గుంటూరుకు రావడానికి సిద్ధమైంది. అప్పుడే వద్దు డిసెంబరులో రమ్మని తండ్రి శ్రీనివాసరెడ్డి ఎంత చెప్పినా వినిపించుకోకపోగా, సీతారామాంజనేయులు ఏం చెబితే అది చేస్తానని మొండి పట్టు పట్టింది. దీంతో తండ్రి తన కూతురు భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నాడు. వివాహితుడైన డాక్టర్‌తన కూతురి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని, అతడి అడ్డు తొలగించాలని తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ప్లాన్ వేశారు. గత నెల 29వ తేదీ రాత్రి గుంటూరువారితోటలోని సీతారామాంజనేయులు ఇంటికి వెళ్లాడు. తన కుమార్తెను విదేశాల నుంచి ఇప్పుడు రావద్దని చెప్పమని కోరాడు. అందుకు వైద్యుడు నిరాకరించాడు.

దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి తన వెంట తెచ్చుకున్న సంచిలోని కారంపొడిని సీతారామాంజనేయులు కంట్లో చల్లాడు. ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టాడు. దీంతో డాక్టర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యచేసిన సమయంలో రక్తంతో తడిసిన చొక్కా, ఇనుప సుత్తిని ఒక కవరులో వేసుకొని, ఫిరంగిపురం మండలం సిరిపురంలోని 30 అడుగుల లోతు ఉన్న బావిలో పడేసి జడ్చర్ల వెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీతో పాటు ఘటనా స్థలిలో లభించిన ఆధారాలతో శ్రీనివాసరెడ్డి నిందితుడని నిర్ధారించుకున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. నిన్న మధ్యాహ్నం నిందితుడు తన ఇంటికి వెళుతుండగా అక్కడ పోలీసులు అరెస్టు చేశారు.

Next Story