బంధువును చంపిన తండ్రి.. కువైట్ నుంచి వచ్చి మరీ.. కూతురితో అలా ప్రవర్తించాడని..
తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ చంపాడో తండ్రి.
By అంజి Published on 12 Dec 2024 1:32 PM ISTబంధువును కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి.. కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని..
తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ చంపాడో తండ్రి. శనివారం కువైట్ నుండి వచ్చిన తండ్రి.. బంధువును దారుణంగా హత్య చేశాడు. తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు బుధవారం వీడియో విడుదల చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు (59) దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడ బిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు.