కరోనా లాక్‌డౌన్‌లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రైతు పప్పన్ సింగ్ గెహ్లాట్ (55) ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాక్‌డౌన్ సమయంలో తన దగ్గర పని చేసే కూలీలను పప్పన్ సింగ్ విమానంలో స్వరాష్ట్రం బీహార్ పంపించారు. అప్పట్లో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారు మోగింది. అయితే తాజాగా ఢిల్లీలోని ఓ ఆలయంలో బుధవారం ఉరివేసుకుని పప్పన్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. అలిపోరా ఏరియాలోని తన ఇంటి ఎదురుగా ఉన్న ఆలయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో తన ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని పేరొన్న సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పప్పన్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పెంపించినట్లు వెల్లడించారు.
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస దారులు తమ గ్రామాలకు చేరుకోవడానికి కష్టపడుతున్న సమయంలో తన దగ్గర పని చేస్తున్న కూలీలను వారి ఇంటికి పంపించేందుకు విమాన టికెట్లు కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. పప్పన్ సింగ్.. ఢిల్లీలోని అలిపొరా ప్రాంతంలో పుట్టగొడుగులు సాగు చేసేవారు. ఆయన దగ్గర బిహార్‌కు చెందిన పలువురు కార్మికులు పని చేస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి కట్టడి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కార్మికులు స్వరాష్ట్రం చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తన వద్ద పని చేసే కార్మికులకు పప్పన్ సింగ్ విమాన టికెట్లు కొనుగోలు చేసి బిహార్‌కు పంపించారు.