విషాదం.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి అదృశ్యమైన పదో తరగతి బాలుడు శవమై కనిపించాడు.
By అంజి
విషాదం.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి అదృశ్యమైన పదో తరగతి బాలుడు శవమై కనిపించాడు. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బాలుడు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు.. తిరిగి రాలేదు. చాలా సమయం గడిచినా కూడా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో, అలాగే తెలిసిన వారి ఇళ్లలో కొడుకు కోసం వెతికారు.
ఎంతకూ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం పలు చోట్ల గాలించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 7 గంటలకు బాలుడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్క బ్లాక్ ముందు అతడి డెడ్ బాడీ లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలుడు కొన్ని రోజుల నుంచి ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్ అయ్యాడని, స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరంచ గిరిజన గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిన్న జరిగింది. హర్కావత్ రాజేష్ అనే విద్యార్థి పురుగుల మందు తాగి మృతి చెందాడు. అతని మృతికి గల కారణాలు తెలియవలసి ఉంది.