మాజీ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో చోరీ కేసు.. ఎస్సై కృష్ణ ఎక్కడా?
హైదరాబాద్: మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో దోపిడీ కేసులో ఎస్సై కృష్ణ ఇప్పటివరకు పరారీలోనే ఉన్నాడు.
By అంజి Published on 28 July 2023 7:00 AM GMTమాజీ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో చోరీ కేసు.. ఎస్సై కృష్ణ ఎక్కడా?
హైదరాబాద్: మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో దోపిడీ కేసులో ఎస్సై కృష్ణ ఇప్పటివరకు పరారీలోనే ఉన్నాడు. 45 రోజులు గడుస్తున్నా కూడా ఎస్సై గురించి ఇంతవరకు పోలీసులకు జాడ దొరకలేదు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను కాజేసిన కేసులో ఎస్సై కృష్ణ నిందితుడిగా ఉన్నాడు. మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో పథకం ప్రకారం.. ఎస్సై కృష్ణ ఒక పని మనిషిని ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా నిందితుడు ఎస్ఐ కృష్ణ శ్యామ్యూల్‌కు పనిమనిషిని దగ్గర చేసి రెండో పెళ్లి చేయాలని పథకం వేశాడు.
అయితే అది ఫెయిల్ అవ్వడంతో ఎస్ఐ కృష్ణ మరో పథకాన్ని రచించాడు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు సురేందర్‌ను రంగంలోకి దించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పి సురేందర్, మాజీ అధికారి శ్యామ్యూల్ కు దగ్గరయ్యాడు. ప్లాన్‌లో భాగంగానే ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి ఆరోగ్యం సరిగా లేదని చెప్పి సెలవు తీసుకుంది. అనంతరం సురేందర్, మాజీ అధికారి ఇంటికి వెళ్లి మీకోసం జ్యూస్, ఇడ్లీ తీసుకువచ్చానని చెప్పి అతని చేత మత్తు కలిపిన ఆ పదార్థాలను తినిపించి.. అతను స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను కాజేశాడు.
ప్రధాన నిందితుడు సురేందర్‌ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేయడంతో కుట్ర కోణం బయటపడింది. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఎస్సై కృష్ణ ఇప్పటివరకు పోలీసుల చేతికి చిక్కలేదు. ఎస్సై కృష్ణ రెండో భార్యతో కలిసి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏ కేసులోనైనా పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పెద్దపెద్ద నిందితులను పట్టుకుంటున్నారు.. కానీ ఎస్సై కృష్ణను మాత్రం పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారంటూ పలు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఎస్సై కృష్ణకు సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. పోలీసులు సీరియస్‌గానే ఎస్ఐ కృష్ణను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.