దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న వేళ.. రాజధాని ఢిల్లీలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఢిల్లీలోని జామియానగర్‌లోని నూర్‌నగర్ ప్రాంతంలో 40 ఏళ్ల వ్యక్తికి పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని వాసిఫ్ సత్తార్ ఘాజీగా గుర్తించారు. సత్తార్‌పై దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. బాధితుడిని కాల్చి చంపిన వెంటనే హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఘటనపై ఆస్పత్రి సిబ్బంది జామియా నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా జామియా నగర్‌లోని మూసా మసీదు సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. క్రైమ్ ఇన్విస్టిగేషన్ బృందం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై హత్య, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతుడు జామియా నగర్ ప్రాంతంలో ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు.