పండ‌గ పూట విషాదం.. క‌ల్తీ మద్యం తాగి 9 మంది మృతి

9 Dead after consuming spurious liquor in Bihar's Gopalganj.దీపావ‌ళి పండ‌గ పూట బిహార్ రాష్ట్రంలో విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 10:32 AM GMT
పండ‌గ పూట విషాదం.. క‌ల్తీ మద్యం తాగి 9 మంది మృతి

దీపావ‌ళి పండ‌గ పూట బిహార్ రాష్ట్రంలో విషాదం నెల‌కొంది. క‌ల్తీ మ‌ద్యం తాగి 9 మంది చ‌నిపోగా మ‌రో 7 గురు తీవ్రఅస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. అస్వ‌స్థ‌తకు గురైన వారిని ఆస్ప‌త్రిలో చేర్పించి.. వైద్యం అందిస్తున్నారు. వీరి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం అమ‌ల్లో ఉంది. దీంతో దొంగ‌చాటుగా మ‌ద్యాన్ని విక్ర‌యిస్తున్నారు. ఇదే అదునుగా కొంద‌రు క‌ల్తీ మ‌ద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం గోపాల్‌గంజ్‌లోని ఓ వ్య‌క్తి ఇంట్లో 16 మంది మ‌ద్యం సేవించారు. మ‌ద్యం తాగిన కాసేప‌టికే వారిలో ఒక‌రు మృతి చెంద‌గా.. మిగిలిన వారంతా అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. స‌మాచారం అందిన వెంట‌నే జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ వైద్య బృందంతో అక్క‌డికి చేరుకుని వారికి ప్రాథ‌మిక చికిత్స అందించారు.

అనంత‌రం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రో 8 మంది ఈ రోజు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. వీరంతా క‌ల్తీ మ‌ద్యం తాగ‌డంతోనే మృతి చెందార‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌధరి తెలిపారు. ఘటనా స్థలం నుంచి మద్యం సీసా, హీమోపతిక్ మందు సీసా కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పంచాయతీ స‌మితి స‌భ్యుడు కూడా ఉన్నాడు.

కాగా.. బిహార్ అక్టోబ‌ర్ 24 నుంచి నేటి వ‌ర‌కు కేవ‌లం 11 రోజుల వ్య‌వ‌ధిలో క‌ల్తీ మ‌ద్యం సేవించి మొత్తం 17 మంది మృత్యువాత ప‌డ్డారు. అక్టోబ‌ర్ 24న సివాన్‌లో అక్టోబ‌ర్ 28, 29 తేదీల్లో ముజ‌ఫ‌ర్‌పూర్‌లోని స‌ర‌య్యా ప్రాంతంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గోపాల్‌గంజ్‌లో ఏకంగా 9 మంది క‌ల్తీ మ‌ద్యం కాటుకు బ‌ల‌య్యారు. మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

Next Story