పేలుడు ధాటికి కుప్ప‌కూలిన మూడు అంత‌స్తుల భ‌వ‌నం.. 7 గురు మృతి

7 Killed as explosion flattens 3 Storey building in Bhagalpur.బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో గురువారం రాత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 10:10 AM IST
పేలుడు ధాటికి కుప్ప‌కూలిన మూడు అంత‌స్తుల భ‌వ‌నం.. 7 గురు మృతి

బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో గురువారం రాత్రి మూడు అంత‌స్తుల భ‌వ‌నంలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడులో ఏడుగురు మృతి చెంద‌గా.. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో కజ్వలిచక్ ప్రాంతంలోని అనాథ శరణాలయం పక్కనే ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి భ‌వ‌నం కుప్ప‌కూలింది. ప‌క్క‌నే ఉన్న మ‌రో రెండు, మూడు ఇళ్లు కూడా దెబ్బ‌తిన్నాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టారు.

భ‌వ‌న శిథిలాల‌ కింద 10 నుంచి 15 మంది చిక్కుకున్నార‌ని బావిస్తున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను మ‌యాగంజ్‌లోని జేఎల్‌ఎన్‌ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు మృతి చెందారు.

ధ్వంసమైన భవనంలోని నివాసితులు పటాకుల తయారీ వ్యాపారం చేస్తున్నారని.. భవనంలో భద్రపరిచిన గన్‌పౌడర్, అక్రమ బాణసంచా, కంట్రీ మేడ్ బాంబులు పేలుడుకు ప్రాథమిక కారణాలని భాగల్‌పూర్ రేంజ్ డీఐజీ సుజిత్ కుమార్ తెలిపారు. భ‌వ‌న య‌జ‌మాని మహ్మద్ యూసుఫ్ అని, దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని.. ఫోరెన్సిక్స్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మరిన్ని వివరాలను పంచుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story