గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్యల చెరువు కాపలాదారులుగా ఉన్న ఆరుగురు మరణించారు. వారంతా విద్యుత్ షాక్‌తో మరణించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. ఒడిశాకు చెందిన కొందరు కూలీలు రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్నారు. రోజూలాగే గురువారం రాత్రి కూడా కాపలాకు వెళ్లారు. చెరువు గట్టుపై ఉన్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
వారు ఉంటున్న షెడ్డుపై కరెంటు తీగలు తెగి పడటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. కాపలాదారులు మృతి చెందిన విషయాన్ని స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను రామ్మూర్తి, కిరణ్, మనోజ్, మహేంద్ర, నవీన్, పండబోగా పోలీసులు గుర్తించారు. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకుని విలపిస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.