ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బ‌స్సు, ట్ర‌క్కు ఢీ.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

6 Killed in collision between roadways bus and truck in Bahraich.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని లక్నో-బహ్రైచ్ హైవేపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 9:01 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బ‌స్సు, ట్ర‌క్కు ఢీ.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌హ్రెచ్ జిల్లాలోని లక్నో-బహ్రైచ్ హైవేపై బుధ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

లక్నో నుంచి ప్ర‌యాణీకుల‌తో బస్సు బహ్రైచ్ కు బ‌య‌లుదేరింది. తెల్లవారుజామున 4:30 గంటల స‌మ‌యంలో జర్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘర్ఘరా ఘాట్ సమీపంలో బ‌స్సును ట్ర‌క్కు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 15 మంది ప్ర‌యాణీకులు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రులంద‌రినీ స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని లక్నో ట్రామా సెంటర్‌కు త‌ర‌లించారు. వీరిలో న‌లుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

పొగ‌మంచు కార‌ణంగా ఎదురుగా వ‌చ్చే వాహ‌నం క‌నిపించ‌క‌పోవ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఘ‌ట‌న అనంత‌రం ట్ర‌క్కు డ్రైవ‌ర్ అక్క‌డి నుంచి పారిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు. బ‌స్సు రాంగ్ సైడ్ నుంచి రావ‌డం వ‌ల్లే ప్రమాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా బావిస్తున్నట్లు తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌రారీలో ఉన్న ట్ర‌క్కు డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి యోగి సంతాపం

ఈ ప్ర‌మాదంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Next Story