HYD: వీడియో గేమ్స్‌పై తండ్రి మందలింపు, ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది
By - Knakam Karthik |
HYD: వీడియో గేమ్స్‌పై తండ్రి మందలింపు, ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అస్తమానం మొబైల్ ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఐదో తరగతి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..బాలుడు ఇటీవలి కాలంలో ఎక్కువ సమయం ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ గడుపుతున్నాడు. చదువుపై దృష్టి పెట్టాలని తండ్రి మందలించడంతో బాధకు గురై తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కిందికి దించి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. చిన్నారులపై ఒత్తిడి, మొబైల్ వినియోగం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.