ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మౌ జిల్లాలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు.
మౌ జిల్లాలోని షాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఇళ్లు మొత్తం వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. అప్పటికే ఆ ఇంట్లోని వారు మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మౌ జిల్లా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. "మౌ జిల్లాలోని షాపూర్ గ్రామం కోపగంజ్ పీఎస్ వద్ద గల ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఓ మహిళ, ఒక వయోజనుడు, 3 మైనర్లు సహా మొత్తం ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం, వైద్య మరియు సహాయక బృందాలతో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగడమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్థారణకు వచ్చాం." అని తెలిపారు.