చావు.. ఎప్పుడు, ఎలా, ఎవరిని పలికరిస్తుందో తెలియదు. ఒకోసారి జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలకు ఎదుటి వారి తప్పిదాలు కారణమవుతుంటాయి. కొన్నిసార్లు సొంత తప్పిదాలు ప్రమాదాలకు కారణాలు అవుతుంటాయి. మరికొన్నిసార్లు పక్కవారిని రక్షించబోయి ప్రాణాలు వీడుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫతేబాద్ తహసీల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయిన ఓ పదేళ్ల బాలుడిని రక్షించే ప్రయత్నంలో మరో నలుగురు మరణించారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు సహా మరో ఇద్దరు (మొత్తం ఐదుగురు) మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాళ్లోకెళితే.. ఫతేబాద్ తహసీల్ పరిధిలోని ప్రతాప్‌పురా గ్రామంలో అనురాగ్ అనే (10) అనే బాలుడు ఇంటి ముందర ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఇది గమనించిన బాలుడి సోదరులు హరి మోహన్ (16), అవినాష్ (12) లతో పాటు.. సోను (25)లు ట్యాంక్‌లోకి దిగారు. దీంతో ఊపిరాడక వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్థానికంగా ఉండే యోగేశ్ అనే వ్యక్తి సైతం వీరిని రక్షించే ప్రయత్నం చేశాడు. అతను సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
దీంతో గ్రామస్తులు పోలీసుల సాయంతో వారందరినీ సెప్టిక్ ట్యాంక్ నుండి బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు అప్పటికే అనురాగ్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. మిగతా నలుగురు ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీకి తరలిస్తున్న క్రమంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.