బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ బస్సు.. నలుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది.

By అంజి  Published on  6 Nov 2023 8:56 AM IST
Bus Falls on Railway Track, Rajasthan, Dausa

 బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ బస్సు.. నలుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 30 మందికి పైగా ప్రయాణికులతో హరిద్వార్ నుంచి ఉదయపూర్ వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది.

"ప్రమాదం తరువాత 28 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వారిలో నలుగురు మరణించారు. వైద్యులు గాయపడిన వారికి చికిత్స చేస్తున్నారు. సంఘటనను పరిశీలించడానికి ఎస్‌డీఎమ్‌ను సంఘటనా స్థలానికి పంపారు" అని దౌసాలోని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ కస్వా తెలిపారు.

దౌసా కలెక్టరేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది తెల్లవారుజామున 2:15 గంటలకు ఓవర్‌బ్రిడ్జి నుండి దౌసాలోని రైల్వే ట్రాక్‌పై పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. శనివారం ఢిల్లీలోని రోహిణిలో వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి పలు కార్లు, స్కూటర్లను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. అవంతికలోని విశ్రామ్ చౌక్ సమీపంలో మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.

Next Story