చిన్నారిని ర‌క్షించేందుకు వెళ్లి.. బావిలో ప‌డ్డ 40 మంది.. 4గురి మృతి..

4 Dead Several Injured after Falling into Well in Vidisha.మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2021 7:10 AM GMT
చిన్నారిని ర‌క్షించేందుకు వెళ్లి.. బావిలో ప‌డ్డ 40 మంది.. 4గురి మృతి..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డిన ఓచిన్నారిని ర‌క్షించేందుకు వెళ్లిన 40మంది బావిలో ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. 23 మందిని కాపాడారు. ఈ ఘ‌ట‌న విధిషా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. గుంజ్‌బ‌సోడ గ్రామంలో గురువారం రాత్రి 9గంట‌ల ప్రాంతంలో ఓ ఎనిమిదేళ్ల బాలిక‌ ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ బావిలో ప‌డింది. ఆ బావి సుమారు 50 అడుగుల లోతు ఉండ‌గా.. 20 అడుగుల వ‌ర‌కు నీరు ఉంది.

బాలిక‌ బావిలో ప‌డిపోయింది అని తెలియ‌గానే.. స్థానికులు వెంట‌నే అక్క‌డకు చేరుకున్నారు. ఆ చిన్నారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రికొంద‌రు బావి గోడ ద‌గ్గ‌ర నిల‌బ‌డ్డారు. అయితే వారి బరువు అధికమవడంతో బావి గోడ కూలిపోయింది. దీంతో సుమారు 40 మంది అందులో పడిపోయారు. సమాచారం అందుకున్నఎన్‌డీఆర్‌ఆఫ్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలును చేపట్టాయి. ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అదే స‌మ‌యంలో బావి ప‌క్క‌న ఉన్న ప్రాంతం కుంగ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న ఓ ట్రాక్ట‌ర్ కూడా బావిలోకి జారి ప‌డింది. అందులో న‌లుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం 23 మందిని బావి నుంచి కాపాడి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. న‌లుగురి మృత‌దేహాల‌ను వెలికితీశారు. మిగ‌తావారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. కాగా.. ఆ చిన్నారి ఇంకా బావిలోనే ఉన్నదని, ఆమెకు గాయాలయ్యాయా లేదా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాల‌కు రూ.5లక్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు రూ.50వేల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు.

Next Story