ఒకే కుటుంబంలో నలుగురు చిన్నారులు మృతి

4 children die after falling into a pond in Narayanapet .. తెలంగాణలోని నారాయణపేటలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో

By సుభాష్
Published on : 21 Nov 2020 6:50 AM IST

ఒకే కుటుంబంలో నలుగురు చిన్నారులు మృతి

తెలంగాణలోని నారాయణపేటలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన దామరగిద్ద మండలం మొల్లమాడక గ్రామ పంచాయతీ పరిధిలో నంద్యానాయక్‌ తండాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. నంద్యా నాయక్‌ తండా కు చెందిన ఓ వృద్దుడు మృతి చెందాడు. అయితే అతని అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరిగాయి. అంత్యక్రియల తర్వాత ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు స్నానం చేసేందుకు చెరువులో దిగారు. ప్రమాదవశాత్తు నలుగురు చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు.

వీరితో పాటు వెళ్లిన ఓ బాలుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే వారి కోసం గాలించి బయటకు తీసేందుకు ప్రయత్నించగా, అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు గణేష్‌ (9), అర్జున్‌ (12), అరుణ్‌ (8), ప్రవీణ్‌ (7)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story