గుజరాత్ రాష్ట్రంలోని సోలాలోని హరియోమ్‌నగర్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 32 ఏళ్ల మహిళ.. కిరాణా వస్తువుల కొనుగోలు విషయంలో తన భర్తతో గొడవపడి బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రిపోర్టు ప్రకారం.. మృతురాలు నమితా జైన్‌గా గుర్తించబడింది. తొమ్మిదేళ్ల క్రితం ఘట్లోడియాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న కపిని వివాహం చేసుకుంది. అయితే ఆరు నెలల క్రితమే దంపతులు అహ్మదాబాద్‌కు మారారు. ఘట్లోడియా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. నమిత తన భర్తను ఇంట్లో కిరాణా సామాగ్రిని నిల్వ చేయమని నిరంతరం ఒత్తిడి చేస్తోంది. కానీ కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభం కారణంగా పెద్ద స్టాక్‌ను కొనుగోలు చేయలేనని కపి చాలా సార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే, బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కపి నమితను దుర్భాషలాడాడని, దీనితో బాధపడిన నమిత.. భర్త కపి, వారి రెండేళ్ల కుమార్తె నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి కపి నీరు త్రాగడానికి మేల్కొన్నప్పుడు నమిత సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ తర్వాత అతను వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కేసు నమోదు చేయగా, డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.