ఆటో కోసం ఎదురుచూస్తున్న వారిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గురువారం ఉదయం ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలంటూ గత 11 నెలలుగా అన్నదాతలు ఆందోళన చేపడుతున్న ఢిల్లీ-హర్యానా బోర్డర్ టిక్రీకి సమీపంలో ఈ ఉదయం ఆటో కోసం ఏడుగురు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో ఓ ట్రక్కు వేగంగా దూసుకువచ్చి.. ఆటో కోసం వేచిచూస్తున్నా వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు.
మిగతావారిని ఆస్పత్రి తరలించారు. చికిత్స పొందుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతులను పంజాబ్‌లోని మన్సా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా అన్నదాతలుగా తెలుస్తోంది.