బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి
జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 24 మందికి గాయాలయ్యాయి.
By అంజి Published on 6 Aug 2023 7:08 AM ISTబ్రిడ్జిపై నుంచి నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి
శనివారం జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 24 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి 8.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికుల కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బస్సు రాంచీ నుంచి గిరిదిహ్‌కు బయలుదేరింది. మరికొందరు నీటిలో మునిగిపోయి ఉంటారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.
కొందరు ప్రయాణికులు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నా.. పూర్తిగా ఎంతమంది ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు. జార్ఖండ్‌లోని దుమ్రీ గ్రామంలో బరాకర్ నదిలో బస్సు పడిపోయింది. గిరిదిహ్-దుమ్రి రహదారిపై వెళ్తున్న బస్సు వంతెన పైనుంచి50 అడుగుల లోతులో నదిలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి గిరిడి ఎమ్మెల్యే సుదివ్య కుమార్, డీసీ నామన ప్రియేష్ లక్రా చేరుకున్నారు. గిరిదిహ్ సివిల్ సర్జన్, డాక్టర్ ఎస్పీ మిశ్రా మాట్లాడుతూ.. "ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారని, 24 మంది గాయపడ్డారు" అని తెలిపారు.
మరోవైపు జిల్లా యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. సోరెన్ హిందీలో చేసిన ట్వీట్‌లో "రాంచీ నుండి గిరిదిహ్ వెళ్లే బస్సు జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని బరాకర్ నదిలో ప్రమాదానికి గురైందని విచారకరమైన వార్తలు వచ్చాయి. జిల్లా యంత్రాంగం రెస్క్యూ పని చేస్తోంది" అని పేర్కొన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ సంఘటనా స్థలంలోనే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.