షాకింగ్ ఘటన.. ఆస్పత్రి పై కప్పుపై 200 మృతదేహాలు
200 Decayed bodies found on hospital roof in Multan.ఓ ప్రభుత్వాసుపత్రి భవనం పైకప్పుపై దాదాపు 200 మృతదేహాలు
By తోట వంశీ కుమార్ Published on 15 Oct 2022 11:27 AM ISTఓ ప్రభుత్వాసుపత్రి భవనం పైకప్పుపై దాదాపు 200 మృతదేహాలు కుళ్లిన స్థితిలో బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన పొరుగున ఉన్న పాకిస్థాన్ దేశంలో జరిగింది.
పంజాబ్ రాష్ట్ర సీఎం సలహాదారు తారిక్ జమాన్ గుజ్జార్ ముల్తాన్‌లోని నిస్తార్ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన ఆస్పత్రిని పరిశీలిస్తున్న సమయంలో ఓ వ్యక్తి మార్చురీలో పడి ఉన్న మృతదేహాల గురించి ఫిర్యాదు చేశాడు. వెంటనే గుజ్జార్ మార్చురీకి వెళ్లి తనిఖీ చేయగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి చలించిపోయారు. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు కుళ్లిపోయి దారుణ స్థితిలో కనిపించాయి. ఆస్పత్రి పై కప్పుపైన మరికొన్ని మృతదేహాలు ఉండగా.. వాటిని పక్షులు ఆహారంగా పీక్కుతింటున్నాయి.
ఈ ఘటనపై తారిక్ జమాన్ గుజ్జార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ వ్యక్తి తనకు ఫిర్యాదు చేసిన వెంటనే మార్చురీకి వద్దకు వెళ్లాను. అయితే.. లోపలికి వెళ్లేందుకు నన్ను అనుమతించలేదు. తలుపులు తెరవకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించడంతో సిబ్బంది తలుపులు తెరిచారు. అక్కడ కనిపించిన దృశ్యం తనను తీవ్రంగా కలచివేయడంతో పాటు షాక్‌కు గురిచేసిందని చెప్పారు.
మార్చురీ గదిలో సుమారు 200 మృతదేహాలు గుట్టలుగా పడి ఉన్నాయి. స్త్రీ, పురుష మృతదేహాలపై బట్టలు లేకుండా చెల్లాచెదురుగా ఆ మృతదేహాలు పడి ఉన్నాయి. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా వైద్య విద్యార్థులు వీటిని పరిశోధనల కోసం ఉపయోగించినట్లు చెప్పారన్నారు. రూఫ్‌పై ఉన్న మృతదేహాలకు కూడా బట్టలులేవు. డేగలు, పక్షులు ఆ మృతదేహాలను ఆహారంగా స్వీకరిస్తున్నట్లు తెలిసింది. మృతదేహాలు పడి ఉన్న విధానం చూస్తుంటే వీటిని వైద్య విద్యార్థుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నట్లుగా కనిపించడం లేదనే అనుమానం వ్యక్తం చేశారు.
ఇక వైద్య విద్యార్థులు మృతదేహాలను వాడిన తరువాత సరైన రీతిలో డీ కంపోజ్ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిస్తార్ మెడికల్ కాలేజీ యాజమాన్యం స్పందించింది. మృతదేహాలను వదిలేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.