కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని బీచ్ రోడ్‌లో రెండు లగ్జరీ కార్ల వీడియోను చిత్రీకరిస్తూ 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్‌గా గుర్తించారు. ఉదయం 7.30 గంటల సమయంలో షూటింగ్ చేస్తూ ఉండగా.. లగ్జరీ కార్లలో ఒకటి అతడిని ఢీకొట్టింది. అదే రోజు ఉదయం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆల్విన్ మరణించాడు.
రోడ్డు మధ్యలో నిలబడి మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తుండగా రెండు కార్లలో ఒకటి అతడిని ఢీకొట్టింది. అతను స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చిత్రీకరిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా నియంత్రణ కోల్పోయి, ఆల్విన్‌ను ఢీకొట్టడంతో అతడు చాలా దూరం ఎగిరి పడ్డాడు. అతని స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆల్విన్ మంగళవారం ఉదయం 11:30 గంటలకు మరణించాడు.
ఆల్విన్ అతని తల్లిదండ్రులకు ఏకైక సంతానం. అతని మృతదేహాన్ని శవపరీక్ష కోసం కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపారు. షూటింగ్ లో భాగమైన రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్-బెంజ్ షూట్ కోసం కార్ డీలర్‌షిప్ నుండి తీసుకువచ్చారు.