తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో విషాదం చోటు చేసుకుంది. రథోత్సవం నిర్వహిస్తుండగా.. రథానికి కరెంట్ తీగలు తగలడంతో.. విద్యుదాఘాతానికి గురై 11 మంది భక్తులు మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.
తంజావూరు సమీపంలోని కలిమేడు గ్రామంలో ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ప్రతీ సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసు స్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా నిన్న(మంగళవారం) రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులు తాడు పట్టుకుని రథాన్ని పలు వీధుల గుండా తీసుకువెలుతున్నారు. బుధవారం తెల్లవారుజామున పూతలూరు రోడ్డులో రథం నిలిచిపోయింది. ఈ సమయంలో రథాన్ని లాగేందుకు యత్నించగా.. హైవోల్టేజీ విద్యుత్ వైర్లు రథానికి తగలడంతో మంటలు చెలరేగాయి.
విద్యుదాఘాతంతో మొత్తం 10 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని తంజావూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 11కి చేరింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇక చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.