బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. కాలేజీ హాస్టల్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలోని కోజికోడ్ నగరానికి చెందిన నితిన్ అనే యువకుడు కాలేజీ హాస్టల్‌లోని టాయిలెట్‌లో గొంతు కోసుకున్నాడు. బెంగళూరులోని ఏఎంసీ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బన్నెరఘట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కోజికోడ్‌లోని ఓ గ్రామానికి చెందిన నితిన్ 15 రోజుల క్రితం డిసెంబర్ 1న కాలేజీలో చేరాడు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. అతని తల్లిదండ్రులు ఇద్దరూ దుబాయ్‌లో పనిచేస్తున్నారు. డిసెంబర్ 14న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తన రూమ్‌మేట్స్ కాలేజీకి వెళుతుండగా, నితిన్ వారితో చేరేందుకు నిరాకరించి, తలనొప్పిగా ఉందని చెప్పి రూంలోనే ఉండిపోయాడు. అతని రూమ్‌మేట్స్ క్లాసులు ముగించుకుని హాస్టల్ గదికి తిరిగి వచ్చేసరికి నితిన్ తలుపులు తీయలేదు. హాస్టల్ వార్డెన్, సిబ్బంది సాయంతో తలుపులు పగులగొట్టారు. ఆ సమయంలో టాయిలెట్‌లో గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉన్న నితిన్ మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. అతని రూమ్‌మేట్స్, కాలేజీ క్లాస్‌మేట్స్ నుండి కూడా అధికారులు స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారు. యువకుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడని, తనను కలవాలని తరచూ వారితో గొడవ పడేవాడని మృతుడి సహవిద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు.