పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును మెటాడోర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి నదియా జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర 24 పరగణాస్‌లోని బాగ్దా నుండి 20 మందికి పైగా వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవద్వీప్ శ్మశానవాటిక వైపు వెలుతున్నారు. ఈ క్రమంలో హన్స్‌ఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్‌బరీలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును మెడాటోర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో 18 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దట్టమైన పొగమంచు, వాహనం అతివేగం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.