17 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపాడు.. అర్ధరాత్రి ఇంటి బయటకు పిలిచి..

17-yr-old girl found dead with throat slit in Kerala. 17 ఏళ్ల బాలిక తన ఇంటి బయట గొంతు కోయబడి రక్తపు మడుగులో శవమై కనిపించింది.

By అంజి  Published on  28 Dec 2022 3:01 PM IST
17 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపాడు.. అర్ధరాత్రి ఇంటి బయటకు పిలిచి..

17 ఏళ్ల బాలిక తన ఇంటి బయట గొంతు కోయబడి రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కేరళలోని వర్కాలోని వడస్సేరికోణం వద్ద జరిగింది. సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత బాలికతో ప్రేమలో ఉన్న 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మధ్య విభేదాలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు సంగీత అనే కళాశాల విద్యార్థినిని నిందితుడు ఇంటి నుంచి బయటకు పిలిపించాడు. ఆ తర్వాత ఏదో విషయమై అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కేకలు, అలజడి విని ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు ఇంటి సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గుర్తించారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మొబైల్ ఫోన్ వివరాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా గోపును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

"ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. నిందితుడి అరెస్టు త్వరలో నమోదు చేయబడుతుంది. వివరణాత్మక విచారణ తర్వాత మాత్రమే ఖచ్చితమైన కారణం తెలుస్తుంది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. వారిద్దరి మధ్య చెడిపోయిన సంబంధమే నేరానికి దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారని, ప్రస్తుతానికి మరిన్ని వివరాలు వెల్లడించలేమని ఆయన తెలిపారు. వర్కాలలోని వడస్సేరికోణంలోని సంగీత నివాస్‌లో నివాసం ఉంటున్న సజీవ్, షాలిని దంపతుల కుమార్తె సంగీత. ఆమె శ్రీ శంకర కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని.

Next Story