ఇరాన్ లో ప్రస్తుతం హిజాబ్ కు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే ఇప్పుడు ఆ దేశంలో 17 సంవత్సరాల అమ్మాయి హత్య మరింత దుమారాన్ని రేపింది. ఆ అమ్మాయి హిజాబ్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో భాగమైంది. ఇప్పుడు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ అంతటా మహిళల నేతృత్వంలోని నిరసనలపై పోలీసుల అణిచివేతలో మరణించిన వారిలో 17 ఏళ్ల నికా షకరామి కూడా ఉన్నారు. ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఆమె అదృశ్యమైంది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమె మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. 'నిక షకరమి' ముఖంపై ఎన్నో గాయాలు ఉన్నాయి.
హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఆరోపిస్తూ మోరల్ పోలీసింగ్ కారణంగా 22 ఏళ్ల మహిళ మహసా అమినీ మరణానికి వ్యతిరేకంగా ఇరాన్‌లోని వివిధ ప్రదేశాలలో వీధుల్లోకి వచ్చిన వేలాది మందిలో మహిళల్లో 17 ఏళ్ల నికా షకరామి ఒకరు. నిరసనల సందర్భంగా ఆమె కనిపించకుండా పోయింది. ఒక వారం తర్వాత, ఆమె ముక్కు, పుర్రెపై దెబ్బలతో ఉన్న ఆమె మృతదేహం తిరిగి వచ్చింది.
ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. నికా షకరమి తన స్నేహితుడికి చివరి ఫోన్ కాల్‌లో భద్రతా దళాల నుండి పారిపోతున్నట్లు పేర్కొంది. మీడియా కథనాల ప్రకారం, మృతదేహాన్ని గుర్తించడానికి వెళ్లినప్పుడు షకరామి కుటుంబం ఆమె తలను చూడటానికి అనుమతించలేదు. ఆమె ముక్కు పగలగొట్టబడింది. తలను ఏదో ఒక భారీ వస్తువుతో కొట్టినట్లు తేలింది.