విద్యార్థులు అన్నాక పదాలను తప్పుగా రాయడం సహజం. ఆ పదాలను ఉపాధ్యాయులు సరి చేసి మరో సారి తప్పుగా రాయకుండా విద్యార్థులకు నేర్పించాల్సి ఉంటుంది. అయితే.. ఓ ఉపాధ్యాయుడు మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. పరీక్షలో పదాన్ని తప్పుగా రాశాడని టీచర్.. విద్యార్థిని చావబాదడంతో.. ఆ విద్యార్థి 19 రోజలు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
ఔరియా జిల్లాలోని వైషోలి గ్రామానికి నిఖిత్ కుమార్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో అశ్వనీసింగ్ అనే వ్యక్తి సైన్స్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెప్టెంబర్ 7న అశ్వనీసింగ్ ఓ పరీక్షను నిర్వహించాడు. ఆ పరీక్షలో నిఖిత్ ఓ పదాన్ని తప్పుగా రాశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అశ్వనీ సింగ్.. నిఖిత్ జట్టు పట్టుకుని కర్రలతో దారుణంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక నిఖిత్ స్పృహ తప్పి పడిపోయాడు.
వెంటనే పాఠశాల యాజమాన్యం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం లఖ్‌నవూ తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పడంతో అక్కడికి తీసుకువెళ్లారు. నిఖిత్ వైద్య ఖర్చుల కోసం రూ.40వేలు అశ్వనీసింగ్ భరించారు. అయినప్పటికీ.. చికిత్స పొందూ సోమవారం నిఖిత్ మరణించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పరారీలో ఉన్న ఉపాధ్యాయుడి కోసం గాలింపు చేపట్టారు.