వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్
14 Days Judicial Remand to Vanama Raghava.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2022 2:12 PM ISTభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు శనివారం హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రాఘవని భద్రాచలం సబ్‌జైలుకి తరలించారు.
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం తానేనని వనమా రాఘవ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు ఏఎస్పీ రోహిత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల(జనవరి) 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమారైలపై పెట్రోల్ పోసి రామకృష్ణ కూడా నిప్పంటించుకున్నారు. ఘటనాస్థలంలోనే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మీ, కుమారై సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్ద కుమారై సాహితీ మృతి చెందింది. రామకృష్ణ బావ మరిది జనార్ధన్ ఫిర్యాదుతో పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. ఐపీసీ 302,307,306 సెక్షన్లు కింద కేసు పెట్టాం. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్పీ వీడియో తీసుకున్నారు. సూసైడ్ నోట్, సెల్పీ వీడియోలో వనమా రాఘవపై ఆరోపణలు చేశారు.
ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయని వీడియోలో చెప్పారు. రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే చనిపోతున్నట్లు చెప్పారు. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నిన్న రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నాం. పలు అంశాలపై రాఘవను విచారించాం. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ ఒప్పుకున్నారు. లభ్యమైన ఆధారాలను సీజ్ చేసి కోర్టుకు సమర్పించాం. రాఘవ పై ఈ కేసుతో పాటు మరో 12 కేసులు ఉన్నాయి. వాటిపై కూడా విచారణ జరుపుతాం. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమని ఏఎస్పీ రోహిత్ చెప్పారు.