పెళ్లి వేడుకలో విషాదం.. ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డి 13 మంది మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం

13 People Die after accidentally falling into well in kushinagar during wedding celebrations

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 2:23 AM GMT
పెళ్లి వేడుకలో విషాదం.. ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డి 13 మంది మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం

ఓ పెళ్లి వేడుక‌లో విషాదం చోటు చేసుకుంది. వివాహా వేడుక‌కు హాజ‌రైన వారిలో 13 మంది మ‌హిళ‌లు ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డి మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో ఓ వివాహ వేడుక జ‌రుగుతోంది. హల్దీ ఫంక్ష‌న్ జ‌రుగుతుండ‌గా.. పెళ్లికి వచ్చిన కొందరు మహిళలు, యువతులు స‌మీపంలోని బావి పైకప్పుపై నిల్చున్నారు. అయితే.. అధిక బ‌రువు కార‌ణంగా బావిపై ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్ పడిపోయింది. దీంతో దానిపై నిలుచుకుని ఉన్న వారు ఒక్క‌సారిగా బావిలో ప‌డిపోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 11 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయార‌ని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘ‌ట‌న పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.


Next Story
Share it