మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13 మంది మృతి చెందారు. రాజ్‌గఢ్‌లోని పిప్లోడిలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వివాహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఈ ఘటనలో మొత్తం 15 మంది గాయపడ్డారు. ఈ ఊరేగింపు రాజస్థాన్‌లోని మోతీపురా నుండి కులంపూర్‌కు వెళ్తోందని జిల్లా పరిపాలన అధికారి ఒకరు వార్తా సంస్థ పిటిఐకి నివేదించారు.
రాజ్‌గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మంత్రి నారాయణ్ సింగ్ పన్వార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. "మేము రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము. రాజస్థాన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి చికిత్స రాజ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడిన కొంతమంది రోగులను భోపాల్‌కు రిఫర్ చేశారు" అని అన్నారు.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసారు. "మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది మరణించిన వార్త చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.