దీపావ‌ళి పండుగ పూట విషాదం.. ప‌టాసులు పేలుస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి

11 Year old boy death firecracker blast Machilipatnam.దీపావ‌ళి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Oct 2022 9:56 AM IST
దీపావ‌ళి పండుగ పూట విషాదం.. ప‌టాసులు పేలుస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి

దీపావ‌ళి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. అంద‌రి ఇళ్ల‌లో పండుగ ఆనందాన్ని నింపితే 11ఏళ్ల బాలుడి కుటుంబంలో మాత్రం విషాదాన్ని నింపింది. ట‌పాసులు కాలుస్తూ 11 ఏళ్ల బాలుడు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలోని నవీన్‌మిట్టల్‌ కాలనీలో 11 ఏళ్ల లక్ష్మి నరసింహారావు అనే బాలుడు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. పెద్ద‌లు ఇంట్లో ఉండ‌గా.. బాలుడు బ‌య‌ట ట‌పాసులు కాలుస్తుండ‌గా ప్ర‌మాదం చోటు చేసుకుంది. అన్నీ ట‌పాసులు ఒక్క‌సారే పేల‌గా.. ప‌క్క‌నే ఉన్న ద్విచ‌క్ర‌వాహ‌నంపై నిప్పులు ప‌డ‌డంతో ఇంధ‌న ట్యాంకు అంటుకుని వాహ‌నం పేలిపోయింది. మంట‌ల్లో బాలుడు చిక్కుకున్నాడు.

బాలుడి కేక‌లు విని కుటుంబ‌స‌భ్యులు బ‌య‌ట‌కు వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పి వేసి బాలుడిని మ‌చిలీప‌ట్నం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ బాలుడు మ‌ర‌ణించాడు. త‌మ క‌ళ్ల‌ముందే కుమారుడు మ‌ర‌ణించ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. బాలుడి మృతితో స్థానికంగా విషాదం నెల‌కొంది.

న‌లుగురికి తీవ్ర‌గాయాలు..

బాణ‌సంచా త‌యారు చేస్తుండ‌గా అవి పేల‌డంతో తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం పులగుర్తలో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story