మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన భేదాఘాట్‌కు తీసుకెళ్లేందుకు తల్లి నిరాకరించడంతో 10 ఏళ్ల బాలిక గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 5వ తరగతి చదువుతున్న బాలిక తనను 10 కిలోమీటర్ల దూరంలోని భేదాఘాట్‌కు తీసుకెళ్లాలని తల్లిని తరచూ అడిగినట్టు పోలీసు అధికారి తెలిపారు. తల్లి నిరాకరించడంతో బాలిక పైకి వెళ్లి డోర్ కర్టెన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని దన్వంతి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వినోద్ పాఠక్ తెలిపారు. "శవపరీక్ష నిర్వహించబడుతోంది. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని అన్నారు.
ఇదిలా ఉంటే.. గత నెలలో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక తన తండ్రి మద్యానికి బానిస కావడం, తన తల్లి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడంతో కలత చెంది ఆత్మహత్య చేసుకుంది. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 26న రావత్ పలాసియా గ్రామంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది.
తన తండ్రి మద్యం తాగేవాడని, తన తల్లిని తరచూ కొట్టేవాడని ఆ బాలిక ఓ లేఖను కూడా వదిలివేసింది. తన తండ్రిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని బాలిక ఆరోపించిందని సూసైడ్ నోట్‌ను ఉటంకిస్తూ అధికారి తెలిపారు. మృతురాలి చెల్లెలు కూడా తమ తండ్రి ఎక్కువగా మద్యం సేవించి తల్లిపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.