ప్రేమ కోసమై వలలో పడెనే పాపం గజదొంగ..!!

By అంజి  Published on  2 Dec 2019 6:42 AM GMT
ప్రేమ కోసమై వలలో పడెనే పాపం  గజదొంగ..!!

దొరకకుండా తప్పించుకుంటున్న దొంగను పట్టుకునేందుకు ఆ మహిళా పోలీస్ భలే ప్లాన్ వేసింది. “నేనె రాధనోయి... గోపాల” అంటూ వలపు వల విసిరింది. రాధ అని పేరు మార్చుకుని ప్రేమ సందేశాలు పంపించింది. బాలకృష్ణ అనే ఆ గజదొంగ ఈ వలలో చిక్కిపోయాడు. చాట్ చేశాడు. మెసేజ్ పంపాడు. ఎమోజీల తో మొదలై “ఫేస్‌బుక్‌లో కిస్సుల” దాకా వచ్చేశాడు. ఆ తరువాత “నిను చూడక నేనుండలేను” అని పాటలు పాడనారంభించాడు. ఆ లేడీ పోలీస్ కూడా “రావోయి రావోయి రాలుగాయి” అంటూ పాటలతోనే జవాబిచ్చింది. సరే కలుద్దాం... అంటూ “మసక మసక చీకటిలో ... మల్లెతోట వెనకాల... మాపటేళ కలుసుకో.... నీ మనసైనది దొరుకుతుంది” అని ఊరించింది. మన వాడూ “ఆగేదెట్టాగా... అందాకా వేగేదెట్టాగా... ఎల్లమ్మచెప్పవే... బుల్లమ్చ చెప్పవే” అనుకుంటూ మనవాడు ఆమె చెప్పిన చోటకి, చెప్పిన వేళకి వచ్చేశాడు. “నా హృదయములో నిదురించే చెలీ... కలలలో నను కవ్వించే సఖి” అని పాట పాడేశాడు.

అక్కడే కథ అడ్డం తిరిగింది. అక్కడ రాధలా ఎదురుచూస్తున్న ఆ లేడీ పోలీసు సడన్ గా ఆలింగనానికి బదులు చేయి మెలిపెట్టి నేలమీద పారేసింది. మాటున దాగున్న మరో ఇద్దరు పోలీసులు అతని మీద పడ్డారు. అంతే రెండు నిమిషాల్లో ఏళ్ తరబడి పోలీసులకు చిక్కకుండా ఉన్న ఆ దొంగ ఎట్టకేలకు దొరికిపోయాడు. “నా పాపం పండెను నేడు... నీ భరతం పడతా చూడు... “ అంటూ ఆమె అతడిని లాకప్ లోకి ప్యాకప్ చేసేసింది.

మధ్యప్రదేశ్ లోని బాల కృష్ణ చౌబే అనే ఆ నలభై రెండేళ్ల గజదొంగపై పదహారు కేసులున్నాయి. ఎన్నాళ్లుగానో తప్పించుకు తిరుగుతున్నాడు. ఎన్నో నేరాలు చేస్తున్నాడు. ఆఖరికి పోలీసులనే సవాలు చేస్తూ ఫేస్ బుక్ అకౌంట్ కూడా తెరిచాడు. ఛతర్ పూర్ జిల్లా పోలీసులు అతనిపై పట్టుకుంటే పదివేలు బహుమతిని కూడా ప్రకటించారు. అయితే ఫేస్ బుక్కే అతడిని బుక్క చేసే సాధనమైంది. అతని ఫోటో, ఫోన్ నంబర్ పోలీసులకు చిక్కింది. చివరికి మాధవీ అగ్నిహోత్రి అనే ఎస్సై బాలకృష్ణకు అమ్మాయిల వీక్నెస్ ఉందని గుర్తించి రాధ అవతారం ఎత్తింది. చాట్ల ద్వారా, మెసేజీల ద్వారా వల విసిరింది. చివరికి “పెళ్లి చేసుకుందాం రా” అని పిలిచి గజదొంగకు “పెళ్లి” చేసేసింది. ఇప్పుడు గజదొంగ బాలకృష్ణ “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం గజదొంగ... అయ్యో పాపం గజదొంగ” అని తీరిగ్గా పాడుకుంటున్నాడు.

Next Story