అమర జవాన్లకు క్రికెటర్ల ఘన నివాళి!
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 3:12 PM ISTభారత్ - చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ తదితర క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.
గాల్వన్ లోయలో మన దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను అర్పించిన సైనికులకు వందనం. సైనికుడిని మించిన నిస్వార్థంగా, ధైర్యవంతుడైన వ్యక్తి మరొకరు లేరు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సాసుభూతి. ఈ కష్టకాలంలో మన ప్రార్థనలతో వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆశిస్తున్నాం. -విరాట్ కోహ్లీ
మన సరిహద్దులను రక్షిస్తూ, మన గౌరవాన్ని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన నిజమైన హీరోలకు నా వందనం. ఈ విషాదాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలను వారి కుటుంబాలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. - రోహిత్ శర్మ
మన మాతృభూమి రక్షణ కోసం రాత్రి, పగలు అహర్నీషలు కష్టపడుతున్న వీరజవాన్లకు బిగ్‌సెల్యూట్. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి - ఇషాంత్ శర్మ
గల్వాన్ లోయలో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లరా.. మీ త్యాగానికి మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం - ఇర్ఫాన్ పఠాన్
గాల్వన్ లోయలో వీరమరణం పొందిన నా భారత సైనికులకు వందనం. ఈ ఆక్రమణలను చైనా నిలుపుదల చేయాలి. మనిషి ప్రాణానికి విలువనిచ్చే శాంతియుత ప్రపంచం మనకు కావాలి. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి - యువరాజ్ సింగ్