మైదానంలోనే ఆఖరి శ్వాస విడిచిన‌ 'క్రికెటర్'

By Medi Samrat  Published on  18 Nov 2019 7:43 AM GMT
మైదానంలోనే ఆఖరి శ్వాస విడిచిన‌ క్రికెటర్

ముఖ్యాంశాలు

  • ఆడుతూ ఆడుతూ ఆవిరైపోయిన ఆట‌గాడు
  • 55 పరుగులు చేసిన వీరేందర్ నాయక్
  • అంపైర్ నిర్ణయంతో అసంతృప్తి

క్రికెట్ యుద్ధభూమిలో మరో క్రీడాకారుడు ఆడుతూ ఆడుతూ ఆవిరైపోయాడు. హైదరాబాద్ లో లీగ్ స్థాయి క్రికెట్ ఆడే వీరేందర్ నాయక్ మ్యాచ్ అడుతుండగా గుండె నొప్పితో చనిపోయాడు. ఎంపీ స్పోర్టింగ్ తరఫున మారేడ్ పల్లి షెనాయ్ నర్సింగ్ హోం ఎదురుగా ఉన్న ఎంపీ బ్లూస్ టీమ్ గ్రౌండ్ లో ఆటాడుతుండగానే నాయక్ కు గుండెపోటు వచ్చింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. దగ్గరే ఉన్న యశోదా ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ఆఖరి శ్వాస విడిచారు. వీరేందర్ నాయక్ వయస్సు 41 ఏళ్లు.

నాయక్ తన ఇన్నింగ్స్ లో 55 పరుగులు చేశారు. ఆ తరువాత వికెట్ కీపర్ చేతిలో క్యాచ్ అయి పెవిలియన్ కి వెనుతిరిగారు. అంపైర్ నిర్ణయంతో నాయక్ అంత సంతృప్తి చెందలేదు. డ్రెస్సింగ్ రూమ్ లోకి రాగానే ఆయన ఆకలేస్తోందంటూ ఇడ్లీలు ఆర్డర్ చేశాడు .. ఆ తరువాత వాష్ రూమ్ లోకి వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయనను హుటాహుటిన యశోదా ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించడంతో భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గత వారం ఆట ఆడినప్పుడు కూడా ఛాతీలో ఇబ్బందిగా ఉందని ఆయన చెప్పినట్టు తోటి ఆటగాళ్లు చెబుతున్నారు. ఆట మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడని చెబుతున్నారు.

ఈ హఠాత్ సంఘటనతో నాయక్ సహచరులు, మిత్రులు, కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. తమతో ఆడుతూనే అసువులు బాసిన నాయక్ కట్టెలా మారడం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. నాయక్ మహారాష్ట్రకు చెందిన వాడు. హెచ్ ఎస్ బీ సీ లో ఉద్యోగి. అత్తాపూర్ లో నివాసం ఉంటాడు.

ఎంపీ స్పోర్టింగ్ సంస్థ తరఫున గత అయిదేళ్లుగా ఆడుతున్నారు. ఆయనకు భార్య , ఎనిమిదేళ్ల కొడుకు, అయిదేళ్ల పాప ఉన్నారు. ఆయన ఆంత్యక్రియలు మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లాలోని సావంత్ వాడీలో జరిగాయి

క్రికెట్ ఆటలో ఆకస్మిక మరణాలు గతంలోనూ సంభవించాయి. 1983 లో ఇంగ్లండ్ కు చెందిన ఫ్రెడెరిక్ రాండన్ తలకు బంతి తగిలి చనిపోయాడు. 1942 లో ఇంగ్లండ్ కి చెందిన యాండీ డుకాట్, 1976 లో ఆ దేశానికే చెందిన మైకేల్ ఐన్స్ వర్త్, 1989 లో వైల్డ్ స్టాక్, 2006 లో పాకిస్తాన్ కి చెందిన వసీమ్ రాజా, 2006 లో నమీబియాకి చెందిన రేమండ్ వాన్ షూర్ లు గుండెపోటు వచ్చి మైదానంలోనే కుప్పకూలిపోయారు.

భారతీయ క్రికెటర్ రమణ్ లాంబా ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తగిలి చనిపోయాడు. 2013 లో దక్షిణాఫ్రికాకి చెందిన డారిన్ రాండల్, 2014 లో ఆస్ట్రేలియా కి చెందిన ఫిల్ హ్యూస్ లు తలగి బంతి తగలడంతో చనిపోయారు. భారతీయ మూలానికి చెందిన హరీష్ గంగాధన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ లో ఆలాడుతూ కుప్పకూలిపోయాడు. ఈ దురదృష్టవంతుల జాబితాలో ఇప్పుడు వీరేందర్ నాయక్ కూడా చేరిపోయాడు.

Next Story