ఇకపై బాల్ ట్యాంపరింగ్ చేయవచ్చు..!
By తోట వంశీ కుమార్ Published on 25 April 2020 3:54 PM ISTబాల్ టాంపరింగ్ .. సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ అంశం క్రికెట్ ప్రపంచాన్ని ఒక్క కుదుపుకుదిపింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడడంతో వారిపై ఏడాది నిషేదం పడింది. ఇక క్రికెట్‌లో బాల్ టాంపరింగ్ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా టెస్టుల్లో స్వింగ్ కోసం బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతుంటారు. అయితే.. త్వరలో బాల్ టాంపరింగ్ కూడా నేరం కాకపోవచ్చు. టాంపరింగ్‌ను చట్టబద్దం చేయాలనే ఆలోచన ఐసీసీ ప్రతిపాదనలో ఉంది.
బంతితో పేసర్లు ఎక్కువగా రాణించాలంటే బంతిని పదే పదే పాలిష్ చేయడం అవసరం. అలా చేస్తే ఇరు వైపులా స్వింగ్‌ను రాబట్టవచ్చు. అందుకనే క్రికెటర్లు బంతి పై ఉమ్మి వేసి పదే పదే ప్యాంట్‌కు రుద్దడం మనం చూస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో బంతి పై ఉమ్మి వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రత ఉన్న కారణంగా అలా చేస్తే ముప్పు పొంచి ఉంటుందని, బంతి మెరుపు కోసం ఉమ్మిని వాడకుండా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ఐసీసీ మెడికల్ కమిటీ సూచించింది. దాంతో బయటి వస్తువుల ద్వారా కూడా టాంపరింగ్ చేసే అవకాశం కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. ప్రస్తుతం క్రికెట్‌లో మూడు రకాల బంతులు ఎస్‌జీ, కూకాబుర్రా, డ్యూక్ బంతులను వాడుతున్నారు. వీటన్నింటిపై ఒకు రకంగా పని చేసేలా ఆ పదార్థం ఉండాలని సూచించింది. వచ్చే మేలో జరిగే టెక్నికల్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.