హద్దు మీరారో.. జైలుకే – మంత్రి కొడాలి నాని హెచ్చరిక

హద్దు మీరద్దు.. ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే జైలుకు పంపిస్తా అంటూ ఏపీ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ఇంతకీ నాని ఎవరిని హెచ్చరించారో తెలుసా.. వివరాల్లోకి వెళితే.. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 30 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆంధ్రాలో ఈ వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడ కేవలం ఆరు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏపీలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈనెల 31వరకు అందరూ ఇండ్లకే పరిమితం కావాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు.

Also Read :తెలంగాణలో 30కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఇదిలాఉంటే ప్రధాని పిలుపులో భాగంగా ఆదివారం దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ జరిగింది. దీంతో ఆదివారం ఎవరూ బయటకు వెళ్లలేదు. సోమవారం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్‌లకు భారీగా వచ్చారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెంచి విక్రయాలు సాగించారు. దీంతో ప్రభుత్వం వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Aslo Read :కరోనా ఎఫెక్ట్.. వీసీ ద్వారా ఇంటి నుంచే వాదించండి

వస్తువుల ధరలు పెంచితే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని, మాట వినకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరిస్తే వారికి, దేశానికి మంచిదన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పేదలు ఇబ్బందులు పడకుండా తెల్లకార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం ఈనెల 29న రేషన్‌ సరుకులు అందించనుంది. రేషన్‌ సరుకులతో పాటు కేజీ కందిపప్పు, నిత్యావసరాలకు ఖర్చుల నిమిత్తం ఇంటికి రూ. వెయ్యి అందించనున్నారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్‌ 4న వాలంటీర్లు ద్వారా అందించనున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *