కరోనా వైరస్‌ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ .. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 416కు చేరింది. కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌ డౌన్‌ ప్రకటించింది. దీనికితోడు పలు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అలర్టయింది. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ సూచన మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also read :ఎందుకీ నిర్లక్ష్యం.. మనల్ని మనం కాపాడుకొనేందుకే లాక్‌డౌన్‌ – ప్రధాని ట్వీట్‌

న్యాయవాదులు నేరుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదని, అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎస్‌.ఏ. బోబ్డే వివరించారు.  న్యాయవాదులకు కొన్ని లింక్‌లు ఇస్తామని, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని వీడియో కాల్‌ కనెక్ట్ చేసుకోవచ్చని బోబ్డే సూచించారు. అప్పటి వరకు కోర్టు భవనంలోని లాయర్ల చాంబర్లన్నీ మూసివేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే లాయర్ల ఎలక్ట్రానిక్‌ పాస్‌లను కూడా రద్దు చేశారు. సోమవారం సాయంత్రం 5గంటల నుంచి కోర్టులోని లాయర్ల ఛాంబర్లన్నింటినీ మూసివేయనున్నారు. మంగళవారం సాయంత్రం కల్లా ఏమైనా ముఖ్యమైన పత్రాలుంటే న్యాయవాదులు తీసుకెళ్లాలని ఆదేశించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.