MRP ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించొద్దు..

By అంజి
Published on : 26 March 2020 7:43 PM IST

MRP ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించొద్దు..

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, సైబరాబాద్ ఫుడ్ సప్లై చైన్ నెట్‌వర్క్‌ కో-ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ డిసిపి అనసూయ తో కలిసి గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ తదితర ప్రాంతాలలో గ్రౌండ్ లెవల్ లో సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్ లు, కిరాణా షాపులు, కూరగాయలు, పండ్లు, మెడికల్ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా రత్నదీప్, గన్ శ్యామ్ తదితర సూపర్ మార్కెట్లను విజిట్ చేసి కస్టమర్లను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తమకు కావాల్సిన సరుకు అందుబాటులో ఉందని, ఎలాంటి సమస్యలు లేవని వినియోగదారులు సీపీకి వివరించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో వస్తువులకు ఎలాంటి కొరత లేదన్నారు. ప్రజల అవసరాలకు కావాల్సినంత సరుకు సిద్ధంగా ఉందన్నారు. సైబరాబాద్ పరిధిలోని వివిధ సూపర్ మార్కెట్లు, ఇతర గ్రోసరీ షాపుల్లో కావాల్సినంత సరుకు సిద్ధంగా ఉందని ప్రజలు ఎటువంటి హైరానా పాడాల్సిన అవసరం లేదన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వివిధ స్టేక్ హోల్డర్లతో ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యామన్నారు.

ఫుడ్ సప్లై చైన్ నెట్‌వర్క్ కో-ఆర్డినేషన్ మానిటరింగ్ కోసం నోడల్ ఆఫీసర్ గా సైబరాబాద్ పరిధిలో డిసిపి అనసూయను నియమించామన్నారు. అలాగే ఒక్కో పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక కానిస్టేబుల్ ను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. కొంతమంది తమకు కావాల్సిన దాని కంటే అధికంగా సరుకు కొనుగోలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది సరికాదన్నారు. తమ అవసరాలకు ఎంతమేర సరుకు అవసరం ఉంటుందో అంతే కొనుగోలు చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎమ్ ఆర్ పీ ధరల కంటే ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షాపుల యాజమాన్యలను హెచ్చరించారు. అదే సమయంలో అధిక ధరలకు వస్తువులను కొనవద్దని వినియోగదారులకు సూచించారు. MRP ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే Dial 100 లేదా సైబరాబాద్ సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 లేదా Covid control room 9490617440, 9490617431 నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

లాక్ డౌన్ పీరియడ్ లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ సభ్యులతో సమయం గడపాలన్నారు. జంక్ ఫుడ్ కి బదులుగా మంచి ఆహారం తీసుకోవాలన్నారు.

Next Story