వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటి.. ఇలా అంటోంది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 6:06 AM GMT
వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటి.. ఇలా అంటోంది..!

కరోనాకు వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి లోగా వచ్చేస్తుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు. వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంస్థలు కూడా నవంబర్ లోపు తీసుకుని వస్తామని చెబుతూ ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభానికి వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉందని.. అన్నీ సర్దుకుంటాయని అంటున్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వేరేలా చెబుతోంది.

ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న టీకాలన్నీ ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్నాయని, ఏ దేశం కూడా ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రయల్స్ నిర్వహించలేదని అంటోంది. వచ్చే ఏడాది రెండో అర్ధభాగం తర్వాత కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదంటూ బాంబు పేల్చింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో మూడో దశకు చాలా సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడుతోంది. వ్యాక్సిన్ ఎంత వరకు రక్షణ ఇస్తుందన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు. ఏ వ్యాక్సిన్ సమర్థత కూడా 50 శాతం ఉందన్న స్పష్టమైన సంకేతాలు అందలేదని అంటున్నారు.

కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన సంస్థ ఫైజర్ వ్యాక్సిన్ ను అతి త్వరలో తీసుకుని వస్తామని అంటోంది. ఈ వ్యాక్సిన్ రెండు దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తిచేసుకుని మూడో దశ ట్రయల్స్ లో అడుగుపెట్టింది. వచ్చే నెల చివరి నాటికి తమ వ్యాక్సిన్ సత్తా వెల్లడవుతుందని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా తెలిపారు. తమ వ్యాక్సిన్ సామర్థ్యం స్పష్టంగా నిరూపితమైతే వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతుల కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎఫ్ డీఏ)కి దరఖాస్తు చేసుకుంటామని అన్నారు. నవంబరు 1 కల్లా అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం చెబుతోంది.

రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ విషయంలో ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ఆసక్తికర అధ్యయనం వెలువరించింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఎటువంటి దుష్ఫలితాలు చోటుచేసుకోలేదని, యాంటీబాడీల పరంగా సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపింది. జూన్-జూలైలో 76 మంది వలంటీర్లపై రెండు దశల్లో ప్రయోగాలు జరుపగా, 100 శాతం యాంటీబాడీల అభివృద్ధిని గుర్తించారని వివరించింది. వ్యాక్సిన్ ప్రధాన కర్తవ్యం అయిన యాంటీబాడీల తయారీని స్పుత్నిక్ వి విజయవంతంగా నిర్వర్తించిందని తెలిపింది.

Next Story