కోర్టు ఆజ్ఞలను భేఖాతరు.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మొహర్రం ఊరేగింపు.. కోవిద్ రూల్స్ ను తుంగలోతొక్కారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 12:10 AM GMT
కోర్టు ఆజ్ఞలను భేఖాతరు.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మొహర్రం ఊరేగింపు.. కోవిద్ రూల్స్ ను తుంగలోతొక్కారు..!

మొహర్రం పర్వదినం రోజున హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో మొత్తం సందడి.. సందడిగా ఉంటుంది. వేల సంఖ్యలో ప్రజలు పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపులో పాల్గొంటారు. కరోనా విపరీతంగా ప్రబలుతున్న సమయంలో ఈ ఊరేగింపుకు అనుమతిని ఇవ్వమని ఇటీవలే హైకోర్టు తెలిపింది. మొహర్రం అంబారి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫాతిమా సేవాదళ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిష‌నర్ తరఫున కౌన్సిల్ పాండురంగారావు వాదనలు వినిపించారు. ఊరేగింపు కోసం ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏనుగుల‌ను సొంత ఖ‌ర్చుల‌తో తెప్పించుకుంటారని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అందుకు హైకోర్టు ఒప్పుకోలేదు.. కరోనా ప్రబలుతున్న సమయంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు చెప్పిందని.. తాము కూడా అనుమతి ఇవ్వలేమని తెలిపింది.

తీరా మొహర్రం పర్వదినం రోజున పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీలో ప్రజలు పాల్గొన్నారు. ఎంతో మంది కనీసం మాస్కులు లేకుండా కనిపించారు. అంబారీని ఈసారి తీసుకుని రాలేదు కానీ ఊరేగింపును మాత్రం కొనసాగించారు. డబీర్‌పురలోని బీబీకా ఆలం అషూర్‌ఖానా నిర్వహకుల ఆధ్వర్యంలో ఆలంలను వ్యాన్‌లో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం కల్పిస్తూ ముందుకు సాగారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలంల ఊరేగింపు చాదర్‌ఘాట్‌ వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది.

కానీ పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో గూమి కూడిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సామాజిక దూరం పాటించకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని పలువురు ఆరోపించారు.

గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. బీబీ కా ఆలం ఊరేగింపునకు ఎలా అంగీకరించిందని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు.దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఎక్కడే గానీ మొహర్రం ఊరేగింపులను నిర్వహించకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిందని.. కానీ అవేవీ తెలంగాణలో పాటించలేదని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేసిందని.. ఒక వర్గానికి చెందిన వారిని సంతృప్తి పరిచే రాజకీయాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని రాజా సింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ భారతదేశంలో ఉందా మరెక్కడైనా ఉందా అని రాజా సింగ్ ప్రశ్నించారు. తెలంగాణకు ఎనిమిదో నిజాంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని.. హిందువులను ద్వితీయ పౌరులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. మొహర్రం ఊరేగింపుకు సంబంధించిన వీడియోను రాజా సింగ్ పోస్టు చేశారు.

Next Story