కొవిడ్‌-19: నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని.. రూ.52వేల ఫైన్‌

By సుభాష్  Published on  2 Jun 2020 10:50 AM IST
కొవిడ్‌-19: నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని.. రూ.52వేల ఫైన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అంతేకాదు కరోనా నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరిపాటించాల్సిందే. కరోనా గురించి ఎన్ని చెప్పినా ముందుగా వచ్చేమాట భౌతిక దూరం. సామాన్యుల నుంచి దేశాధినేతలకు సైతం ఆ నిబంధన వర్తిస్తుంది. అలా అని ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రొమేనియా ప్రధాని డోవిక్‌ ఒర్బాన్‌ ఈనెల 25న ఆయన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మంత్రులందరు హాజరయ్యారు. ఈ పార్టీలో ఎవ్వరు కూడా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా పొగతాగడం, మద్యపానం సేవించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అయితే ఆ ఫోటోలపై స్పందించిన లుడోవిక్‌ తాను సోషల్‌ భౌతిక దూరం పాటించలేదని అంగీకరించారు. అంతేకాదు రూ.52వేలు జరిమానా కట్టారు. రొమేనియా ప్రధాని మాట్లాడుతూ.. నేను నిబంధనలను ఉల్లంఘించాను. పౌరులతో సంబంధం లేకుండా ప్రధాన మంత్రి నియమాలు పాటించాలి. చట్టాన్ని గౌరవించాలి. నేను అతీతుణ్ని కాదు. అందుకే ఫైన్‌కట్టాను. ఈ ఘటనతో అధికారుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా.. అంటూ ప్రధాని లుడోవిక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక భౌతిక దూరం పాటించకుండా అందరు సిగరేట్‌ తాగడం, మద్యం సేవించడం వల్ల కరోనా ఆంక్షలు ఉల్లంఘించినందుకు ప్రధానితో సహా మంత్రులందరు అపరాధ రుసుము చెల్లించాల్సివచ్చింది.

కాగా, చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరించింది. దాదాపు 200పైగా దేశాలకు సోకి, జనాలను పట్టిపీడిస్తోంది. లక్షలాదిగా మరణాలు, పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్‌ను అంతం చేసేందుకు ఎలాంటి వ్యాక్సిన్‌లు, మందులు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దేశ దేశాలను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక చేసేదేమి లేక కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నారు. భౌతిక దూరం పాటించడమే మేలంటూ జాగ్రత్తలు వివరిస్తున్నారు.

Next Story