డైమండ్ ప్రిన్సెస్ లో 174 మంది కోవిడ్ 19 బాధితులు
By రాణి Published on 12 Feb 2020 10:55 AM IST10 రోజుల క్రితం జపాన్ యొకొహామా పోర్టుకు చేరిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో మరో 39 మందికి కోవిడ్ 19 (కరోనా) సోకినట్లు నిర్థారణ అయింది. నౌకలో ప్రయాణించినవారిలో తాజాగా 53 మందికి వైద్య పరీక్షలు చేయగా..వారిలో 39 మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. దీంతో నౌకలో ప్రయాణించిన 3,711 మంది ప్రయాణికుల్లో 174 మంది కోవిడ్ 19 బాధితులున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. 174 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా..మిగతా ప్రయాణికులందరినీ నౌకలోని క్యాబిన్లకే పరిమితం చేయడంతో..10 రోజులుగా వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ నెల 19వ తేదీన వారిని విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే నౌకలో ఉన్న భారతీయులతో అక్కడి..భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది.
https://telugu.newsmeter.in/corona-virus-positive-in-dimond-princess/
మరోవైపు చైనాలో కోవిడ్ 19 మృతుల సంఖ్య 1,110 కి చేరింది. మంగళవారం హుబెయ్ ప్రావిన్స్ లోనే 94 మంది మృతి చెందగా..1638 మందికి కోవిడ్ 19 సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో కోవిడ్ 19 బాధితుల సంఖ్య 44,200కి చేరింది. ఈ వైరస్ చైనాలోనే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలకు కూడా త్వరగా వ్యాపించే ప్రమాదం లేకపోలేదని డబ్ల్యూహెచ్ ఓ చేసిన ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. కాగా..కరోనా పేరును కూడా డబ్ల్యూహెచ్ఓ నే మార్చింది. Corona లో Co, Virus లో Vi, Disease లో D అక్షరాలను కలిపి డబ్ల్యూహెచ్ఓ COVID -19గా కరోనాను ఖరారు చేసింది.