ఢిల్లీ: కరోనాపై పోరుకు భారత్‌ పిలుపునిచ్చింది. అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదన తీసుకువచ్చింది. కాగా భారత్‌ తరఫున కోటి డాలర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనాపై యుద్ధం చేసేందుకు కలిసి నడవాలని సార్క్‌ కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి.

కరోనాను కట్టడి చేసేందుకు ఆదివారం నాడు సార్క్‌ దేశాల నేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనను సభ్య దేశాలు అంగీకరించాయి. ఇతర సభ్య దేశాలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించాలని ప్రధాని మోదీ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లో యుద్ధ ప్రతిపాదికన అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు అన్ని రకాల కిట్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైతే సార్క్‌ సభ్య దేశాలకు కూడా వాటిని ఇస్తామని మోదీ చెప్పారు.

Also Read: కరోనా ఎఫెక్ట్‌.. ఉగ్రవాదులకు ఐసిస్‌ సలహాలు..

మన దేశాల్లో ఇప్పటి వరకు మొత్తంగా 150 కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి అని, అయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని సమీక్షించేందుకు భారత్‌లో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందించామని, ఆ సాప్ట్‌వేర్‌ను సార్క్‌ దేశాలకు ఇస్తామని ప్రధాని మోదీ తెలిపారు. వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సార్క్‌ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్‌ సోలిహ్‌, అప్ఘానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, పాక్‌ ప్రధాని స్థానంలో ప్రత్యేక సలహాదారు జాఫర్‌ మీర్జా పాల్గొన్నారు.

Also Read: కరోనా కారణంగా ఒక్క రోజులోనే 85 మంది మృతి..!

ఇక  ఈ సమావేశంలోనూ పాకిస్తాన్‌ తన బుద్ది పొనిచ్చుకోలేదు. కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తింది. కశ్మీర్‌లో నిర్భందాన్ని తొలగించాలంటూ వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ను అరికట్టడంతో చైనా గొప్పగా వ్యహరించిందని చెప్పుకొచ్చింది.

వైరస్‌పై సమన్వయంగా యుద్ధం చేసేందకు ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేయాలని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.