కరోనా కారణంగా ఒక్క రోజులోనే 85 మంది మృతి..!

By అంజి  Published on  15 March 2020 9:45 AM GMT
కరోనా కారణంగా ఒక్క రోజులోనే 85 మంది మృతి..!

కరోనా వైరస్ దెబ్బకు ఇరాన్ దేశం కూడా చిగురుటాకులా వణుకుతోంది. కోవిద్-19 కారణంగా ఇరాన్ లో మరో 85 మంది చనిపోయారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఒక్క రోజులో అంత మంది చనిపోవడం ఇరాన్ లో ఇదే మొట్ట మొదటిసారి. కరోనా కారణంగా భారీగా నష్టపోయిన, ప్రభావితమైన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. శుక్రవారం నాడు అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఒక్క రోజులోనే ఇరాన్ లో 85 మంది మరణించారని తెలిపారు.

గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ సోకిన 85 మంది మరణించారు. ఇరాన్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 514కి చేరిందని హెల్త్ మినిస్ట్రీ అధికారులు టెలివిజన్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. కొత్తగా 1289 మందికి కరోనా సోకిందని.. వారందరూ ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

ఇరాన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 11,364 కు చేరిందని అధికారులు తెలిపారు. ఇరాన్ లోని టెహ్రాన్ ప్రాంతంలో కొత్తగా చాలా కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. చైనా వెలుపల కరోనా కారణంగా ఎక్కువ మరణాలు చోటుచేసుకున్న దేశంగా ఇరాన్ చేరింది. కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో అధికారులు కూడా విఫలమయ్యారు. కరోనా సోకిన వారిలో అధికార పార్టీ నేతలు, విపక్ష పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ అత్యంత సన్నిహితుడైన అలీ అక్బర్ వెలాయతీకి కూడా కరోనా సోకిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పర్షియన్ పండుగైన 'నౌరుజ్' మార్చి 20న జరుపుకోనున్నారు ఇరాన్ ప్రజలు. ఆరోజు కోసం ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి ఇరాన్ ప్రజలపై విరుచుకుపడింది. అధికారులు మొదట్లోనే అప్రమత్తం కాకపోవడంతో ఇరాన్ లో కరోనా విజృంభించింది. ప్రస్తుతం వీధులన్నిటినీ ఖాళీ చేయమని పిలుపునిచ్చింది అక్కడి ప్రభుత్వం. షాపులను మూసివేయాలని.. సమావేశాలను రద్దు చేసుకోవాలంటూ పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేసింది. ఆర్మీని రంగం లోకి దింపి మరీ వాళ్ళు అనుకున్న పని పూర్తీ చేశారు. అక్కడ కర్ఫ్యూ లాంటిది అమలు చేస్తున్నా నౌరుజ్ పండుగ సెలవుల కారణంగా ప్రజలు బయట తిరగడానికే ఇష్టపడుతున్నారని అక్కడి ఎంపీ ఒకరు తెలిపారు. దీంతో చేసేది లేక ఆర్మీని రంగం లోకి దింపారు.

కోమ్‌ నగరం నుంచే..

ఆధ్యాత్మిక నగరమైన కోమ్ నుండే ఈ వైరస్ ఎక్కువగా ప్రబలిందని చెబుతున్నారు. ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రౌహానీ ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో తమను కనీసం పట్టించుకోలేదని అక్కడి ప్రజలు వాపోయారు. అధికారులు చెబుతున్న దాని కంటే ఇరాన్ లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అంటున్నారు అక్కడి ప్రజలు. పెద్ద ఎత్తున సమాధులు త్రవ్వుతూ ఉన్నారని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కడి అధికారులు ఇరుకున పడ్డారు. ఆ దేశ హెల్త్ మినిస్ట్రీతో కలిసి ఆర్మీ కూడా ప్రస్తుతం పని చేస్తోంది. అధికారులు చెప్పింది ప్రజలు తప్పకుండా వినాలని.. ప్రజలు గూమికూడడాలు లాంటివి చేయకండని సూచనలు ఇస్తున్నారు. అధికారులు ఘోరంగా విఫలమైన తరుణంలోనే ఆర్మీని దింపారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Next Story