భారత్‌లో 24గంటల్లో 55,079 కేసులు.. 779 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 31 July 2020 5:34 AM GMTభారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 779 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత దేశంలో ఒక్క రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,38,871కి చేరింది.
మొత్తం నమోదు అయిన కేసుల్లో 10,57,806 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5,45,318 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి 35,747 మంది మరణించారు. నిన్న ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం గురువారం నాటికి 1,88,32,970 కరోనా టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. 46లక్షల కేసులతో అమెరికా, 26లక్షల కేసులతో బ్రెజిల్ లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.