భారత్‌లో 14లక్షలు దాటిన కరోనా కేసులు.. 24గంటల్లో 49,931కేసులు
By తోట వంశీ కుమార్ Published on 27 July 2020 9:50 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 49,931 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 708 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,35,453కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 9,17,568 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,85,114 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 32,771 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే.. 5.5లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్(భారతీయ వైద్య పరిశోధన మండలి) తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 1.68కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. నిన్న ఒక్క రోజే 31,991 మంది కోలుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తరువాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది.