టోల్‌గేట్ రేకులు మీద పడి రైతు దంపతులు మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 May 2020 5:57 PM IST
ఈదురుగాలుల బీభత్సానికి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో రైతు దంపతులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని మిడ్జిల్ మండలం మున్ననూరులో దగ్గరలోని హైవేపై నిర్మాణంలో ఉన్న టోల్‌గేట్ రేకులు ఎగిరిపడి దంపతులపై పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్ననూరులో కొత్తగా టోల్‌గేట్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఇనుపకడ్డీలు, రేకులతో టోల్‌గేట్ పై కప్పును నిర్మిస్తున్నారు. మున్ననూరు గ్రామానికి చెందిన కృష్ణయ్య, పుష్ప దంపతులు టోల్‌గేట్ సమీపంలో రోడ్డుపై వడ్లు ఆరబోశారు. వర్షం వల్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందని వడ్లను కుప్పగా చేద్దామని భార్యభర్తలు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో బలమైన ఈదురుగాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న టోల్‌గేట్ రేకులు ఎగిరిపడ్డాయి.
రేకులు బలంగా తగలడంతో దంపతులిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. రైతు దంపతుల మృతితో మున్ననూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా పడిఉన్న వారిని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.